ఇండియన్ వంటకాల్లో మసాలకు ఉన్న స్థానం ప్రత్యేకం. నాన్ వెజ్ వంటలకు ఘాటైన మసాలా వేస్తే వాసన వీధి చివర వరకూ వెళ్లాల్సిందే. ఒక్క నాన్ వెజ్ ఏంటి.. వెజ్ కర్రీస్ లో కూడా మసాలాలు వేస్తే ఆ రుచే వేరు. చాలామంది మసాలు లేకుండా ఏ వంట వండరేమో కదా..వివిధ దేశాల ప్రజలు వారి వారి రుచికితగ్గట్లు మసాలను తమ వంటకాల్లో దట్టిస్తుంటారు.
అయితే..మనం తినే ఆహారంలో మట్టిపడితే మనం అది తినం పక్కన వేస్తాం..కానీ వాళ్లు మాత్రం ఏకంగా మసాలలా ప్లేస్ లో మట్టినే వేస్తారట. అవునండి మీరు విన్నది నిజమే..పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ పరిధిలో ఉన్న హర్ముజ్ ఐలాండ్‌లోని ప్రజలు మట్టినే మసాలాగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడి మట్టిని వంటలో వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట.
మట్టిలో ఖనిజాలు..
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ ఐలాండ్‌లోని పర్వతాలు వివిధ వర్ణాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రెయిన్‌బో ఐలాండ్ అని కూడా అంటారు.. ఇక్కడి ఒక్కో రంగు పర్వతం ఒక్కో రుచిగల మట్టిని కలిగి ఉంటుందట. దీంతో స్థానిక ప్రజలు ఈ పర్వతాల మట్టిని మసాలా దినుసులు కలిపినట్టు కలిపేసి.. వంటల్లో వేస్తారు.. ఇక్కడి మట్టిలో ఐరన్‌తోపాటు 70 రకాల ఖనిజాలున్నాయట. దీంతో ఈ మట్టి మసాలాలు రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని స్థానికులు అంటున్నారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..
ఈ ఐలాండ్‌లోని పర్వతాల్లో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని, అవే కాలక్రమంలో మట్టిలో కలిసిపోయాయని భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, మట్టికి రుచి ఉండటం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇక్కడి ప్రజలు ఆ రుచిని గుర్తించి వంటల్లో ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఈ రంగురంగుల పర్వతాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులు వస్తారు. వారు కూడా హర్ముజ్ ఐలాండ్ ప్రత్యేక వంటలను రుచి చూసి ఫిదా అవుతుంటారు. నిజంగానే ఆ మట్టితో చేసిన వంటలు అంతరుచిగా ఉంటాయామో కదా..! ఏది ఏమైనా మట్టితో వంటలు చేయటం మాత్రం హైలెట్.