ప్రముఖ సోషల్ యాప్ షేర్ చాట్.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య సేతు యాప్‌కు గాను విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది. ఈ మేరకు షేర్ చాట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కోవిడ్-19 సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు కరోనా వైరస్ ఉన్న వారిని, హాట్‌స్పాట్‌లను సులభంగా గుర్తించి ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19కు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఆరోగ్య సేతు యాప్‌లో తెలుసుకోవచ్చు.
ఆరోగ్యసేతు యాప్‌ను విస్తృతంగా తన ప్లాట్‌ఫాంపై ప్రచారం చేయడానికి గాను షేర్‌చాట్ ఏకంగా రూ.5 కోట్ల యాడ్ క్రెడిట్లను ఖర్చు చేయనుంది. షేర్‌చాట్ యాప్ దేశంలోని 15 భిన్న భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉండగా.. మొత్తం 6 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో ఈ యూజర్లందరికీ చేరేలా షేర్ చాట్.. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రచారం చేయనుంది.
దేశ ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకు, కరోనాపై సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలతోపాటు.. ఆరోగ్య సేతు యాప్‌కు కూడా షేర్ చాట్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఇందుకు గాను తమకు అవకాశం లభించినందుకు గర్వంగా ఫీలవుతున్నామని షేర్ చాట్ తెలిపింది.