ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వాళ్లు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా అమెరికాలో కూడా ఒక మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే మహిళ చనిపోయిన ఆరు నెలలకు ఆమెకు కరోనా నిర్ధారణ కావడం గమనార్హం. అమెరికా ఆరోగ్య శాఖ నుంచి చనిపోయిన తన తల్లికి కరోనా నిర్ధారణ కావడం కొడుకును ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇందులో మరో విచిత్రం ఏమిటంటే సదరు మహిళ చనిపోయే నాటికి అమెరికాలో కరోనా కేసులే వెలుగులోకి రాలేదు. అమెరికాలోని షెల్బీ కౌంటీలో తొలి కరోనా కేసు నమోదు కావడానికి కొన్ని నెలల ముందే ఆ మహిళ చనిపోయింది. దీంతో మహిళ కొడుకు ఆ రిపోర్ట్ నిజం కాదని భావించాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీన పీసీఓడీ సమస్యతో తన తల్లి సాండ్రా విట్టింగ్టన్ చనిపోతే జూన్ 20వ తేదీన తన తల్లి కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఉన్న రిపోర్టు నిజం కాదని అనుకున్నాడు.
అయితే ఆ కొడుకు అనుమానమే చివరకు నిజమైంది. అమెరికా ఆరోగ్య శాఖ ఈ ఘటన గురించి స్పందించింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని తప్పుడు రిపోర్టు ఇచ్చినందుకు చింతిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. సాండ్రా విట్టింగన్ కొడుకు ట్రాయ్ విట్టింగన్ జరిగిన ఘటన తనను చాలా బాధించిందని చెప్పారు. ఎప్పుడో చనిపోయిన తన తల్లికి ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ పొరపాటు ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.