ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విహార యాత్రల్లో ఉన్నారు. తమకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టి వచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ వారణాసిలో కాసేపు సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా అతను అక్కడి గంగానదిలో బోటింగ్ చేస్తూ పక్షులకు ఆహారం తినిపించాడు.
అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ కూడా ఒకటి. ఈ క్రమంలో శిఖర్ ధావన్ పక్షులకు ఆహారం తినిపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. అయితే దీనిపై అక్కడి అధికారులు స్పందించారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం ఉన్నందున బోటింగ్ ల ద్వారా వెళ్లే టూరిస్టులు పక్షులకు ఆహారం తినిపించకూడదనే నియమం ఉంది. కానీ టూరిస్టులకు ఆ విషయం తెలియడం లేదు. బోట్‌మన్‌లకు ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారు టూరిస్టులు పక్షులకు ఆహారం తినిపించకుండా చూడాలి. కానీ శిఖర్ ధావన్ విషయంలో బోట్‌మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అధికారులు తెలిపారు. అందువల్ల బోట్‌మన్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అయితే టూరిస్టులకు ఈ విషయం తెలియదు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు ఉండవని అధికారులు తెలిపారు. కాగా శిఖర్ ధావన్ పక్షులకు ఆహారం తినిపిస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ధావన్ ఆధ్యాత్మిక క్షేత్రాలలో పర్యటిస్తున్నాడు. అందులో భాగంగానే అతను తాజాగా వారణాసిని సందర్శించాడు.