ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అవసరం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం విద్య, వైద్యం, వ్యవసాయ, సంక్షేమ రంగాలపై దృష్టి పెట్టామని అన్నారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ ఎక్కడా ఇబ్బంది లేకుండా తన ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది అని ఆయన వెల్లడించారు.
కోవిడ్ నుంచి వ్యాక్సిన్ వరకు కీలక మౌళిక వసతులను ప్రభుత్వం సమకూర్చుకుంది అని అన్నారు. రాష్ట్రంలో రేషన్, నిత్యావసరాలు, కూరగాయలకు ఇబ్బంది లేకుండా కిసాన్ రైలు ద్వారా ఇతర ప్రాంతాలకు పంపాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తీసేలా కొన్ని సంఘటనలు జరిగాయి అని అన్నారు. మతపరమైన ఇబ్బందులు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కుట్రలు సఫలీకృతం కాకుండా అడ్డుకోగలిగాం అని అన్నారు.
పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా రూ. 28,084 కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించాం అని ఆయన తెలిపారు. రూ. 23,535 కోట్ల విలువైన భూమిని పేదలకు అందించాం అని వెల్లడించారు. వివిధ సంక్షేమ పధకాల ద్వారా రూ. 94877 కోట్లను 7.93 కోట్ల మందికి అందించాం అని అన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ. 13101 కోట్లు అందించాం అని పేర్కొన్నారు. రైతుల సౌలభ్యం కోసం 10641 ఆర్బీకేలు ఏర్పాటు చేసామని అన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కావడం గతంలో ఇబ్బందులు సృష్టించింది అని పేర్కొన్నారు.