తెలంగాణ ఇంటర్ లో కొత్తగా షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. అసలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, కోడింగ్, బ్లాక్ లైన్ టెక్నాలజీ, డేటా సైన్స్, రోబోటిక్స్, కోడింగ్ తదితర కోర్సులు ప్రవేశ పెట్టనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీటిని షార్ట్ టర్మ్ కోర్సులుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్మీడియట్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పలు వొకేషనల్ కోర్సులు ఉన్నాయి.
అవి కాకుండా 3 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన షార్ట్ టర్మ్ కోర్సులుగా వీటిని ప్రవేశపెట్టేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. జేఎన్‌టీయూ నేతృత్వంలో ఇండస్ట్రీ, సబ్జెక్టు నిపుణలతో వీటికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించేందుకు కమిటీని కూడా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ముందు షార్ట్ టర్మ్ కోర్సులుగా వాటిని ప్రవేశపెట్టి విద్యార్థుల నుంచి వచ్చే స్పందన బట్టి పూర్తి స్థాయి వృత్తి విద్యా కోర్సులుగా అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.