పార్టీలైన్‌కు భిన్నంగా మాట్లాడడమే రాజకీయం అనుకుంటున్న నాయకులు పెరుగుతున్నారు. ఎంతగా పార్టీని వివాదం చేస్తే.. అంతగా గుర్తింపు వస్తుందని భావిస్తున్న నాయకులు పెరుగుతున్నారు. ఈ క్రమం లో తొలి వరుసలో నిలుస్తున్న ఎంపీ.. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు. ఆయన వైసీపీలోనే ఉంటారు. కానీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేక ప్రకటనలు చేస్తారు. తనకు జగన్ అంటే ఇష్టమే అంటారు.. కానీ, ఆయనను పరోక్షంగా విమర్శిస్తారు. ఇలా.. ఆది నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఒకసారి నేరుగా సీఎం జగన్ ఆయనను పిలిచి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలైన్‌కు భిన్నంగా మాట్లాడరాదని ఆయనను జగన్ హెచ్చరించారు. అయినాకూడా ఆయన తన పద్ధ తి మార్చుకోలేదు. తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ పిలుపును కాదని ఆయన వ్య వహరించారు. అది కూడా అధికారికంగా వచ్చిన వైసీపీ ప్రకటనను ఆయన పక్కన పెట్టి వ్యవహరించారు. రెండు రోజుల కిందట వైసీపీ కీలక నాయకుడు , ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి నిర్వహించే చర్చలకు వెళ్లరాదని ప్రకటించారు.
అలా వెళ్తే.. పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా గడికోటతన ప్రకటనలో అధికారికంగా హెచ్చరించారు. దీంతో చాలా మంది నాయకులు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలకు, చర్చా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కానీ, తాజాగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఏబీఎన్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై ఈ చర్చ దృష్టి పెట్టింది. ఈ చర్చలో పాల్గొన్న రఘు.. తన మనసులో మాటలు చెప్పారు. ఈ సమయంలోనే ఆయనకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది.
చీఫ్ విప్ గడికోట ఆదేశాలనుమీరు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. అయితే, ఆయన మాత్రం ఈ ఫోన్‌ను పట్టించుకోకుండానే తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన గడికోట.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు ఎంపీకి షాకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. దీనికి ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి వేటు వేస్తారా? వదిలేస్తారా? అని వైసీపీలో చర్చ సాగుతుండడంగమనార్హం.