ఇక్కడ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానప్రాప్తి ఎక్కడో తెలుసా!

-

ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. తూర్పుద్వారం గుండాలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయంలో పశ్చిమాభికంగా ఉన్న గోపురం గుండా లోనికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల ఈ దేవాలయం దర్శించినవారికి విజయప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం….

జయజయ నృసింహ సర్వేశ !
భయహర వీర ప్రహ్లాద వరద !!

అంటూ నరసింహస్వామిని స్తుతించారు అన్నమయ్య. తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిలో సింహాచల నరసింహ క్షేత్రం ప్రముఖమైనది.

విశాఖపట్నానికి దగ్గరలోని తూర్పుకనుమల్లో భాగమైన పర్వతమే సింహాచలం. ఆ కొండమీద వెలసిన దైవమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయంలోని మూలవిరాట్టుని సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుడే ప్రత్రిష్టించాడని చెబుతారు. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులని చంపిన వరాహ, నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది. వరాహ ముఖంతో, మనిషి శరీరంతో, సింహం తోకతో స్వామి ఉంటారు.

ఒకప్పుడు ప్రహ్లాదుని పాలనలో పూజలందుకున్న ఈ ఆలయం క్రమేపీ శిథిలావస్థకు చేరుకుందనీ.. స్వామి మీద పుట్టలు వెలిశాయని స్థల పురాణం చెబుతోంది. ఒకనాడు పురూరవుడనే మహారాజు ఈ ప్రాంతం గుండా వెళ్తుండగా ఇక్కడ పుట్టల కింద స్వామివారు ఉన్నట్లు ఆయనకు స్వప్నంలో తెలిసిందట. దాంతో సహస్ర కళశాలతో పుట్టని తడిపి స్వామి వారిని రూపం బయటపడేట్లు చేశారట. ఈ సంఘటన అక్షయ తృతీయ రోజున సంభవించింది. ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు కనుక నిత్యం వారిని చందనంతో కప్పివేయమని పురూరవుడు ఆజ్ఞాపించారని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి అక్షయ తృతీయ సందర్భంగా పాత చందనాన్ని తొలగించి 12 గంటలపాటు స్వామివారి నిజరూపం దర్శనానికి అవకాశమిస్తారు. ఆపై స్వామివారిని సహస్ర కళశాలతో అభిషేకించి తిరిగి చందనాన్ని లేపనం చేస్తారు.

నిజరూప దర్శనం సమయంలో స్వామివారి విగ్రహం త్రిభంగి భంగిమలో కనిపిస్తుంది. నిటారుగా నిల్చొని, నడుము దగ్గర ఒక పక్కకు ఒంగి, తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ. చందనోత్సవం సందర్భంగానే కాకుండా… ఏడాది పొడవునా ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు కారణాలు చాలానే కనిపిస్తాయి. సంపెంగ పూలతోనూ, పనసచెట్లతోనూ నిండిన సింహాచలం కొండ మీదకు అడుగుపెట్టగానే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్నది భక్తుల భావన.

తిరుమల కొండల మీద ఉన్నట్లు సింహాచలం మీద కూడా అనేక జలధారలు కనిపిస్తాయి. వాటిలో గంగధార, ఆకాశధార, మాధవధార, చక్రధార ప్రముఖమైనవి. ఈ ధారలలో స్నానం చేసి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. పశ్చిమముఖంగా ఉన్న గాలిగోపురం ద్వారా గుడిలోకి ప్రవేశించడం మరో చిత్రం. సాధారణంగా మనం చూసే గుళ్లన్నీ తూర్పుముఖంగా కనిపిస్తాయి. కానీ సింహాచలం దీనికి మినహాయింపు. ఇలా పశ్చిమాభిముఖంగా ఉండే ఆలయాన్ని దర్శిస్తే విజయం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

కప్పస్తంభం

ఇక్కడ గర్భగుడికి ఎదురుగా కనిపించే స్తంభాన్ని కప్పస్తంభం అంటారు. స్వామివారికి భక్తులు తమ కప్పాలను (ముడుపులు) చెల్లించుకుంటారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఆ కప్ప స్తంభం కింద సంతానగోపాలస్వామి యంత్రం ఉందని అంటారు. అందుకే ఈ స్తంభాన్ని కౌగలించుకున్నవారికి తప్పకుండా సంతానం లభిస్తుందట. ఆలయం గోపురం మాత్రమే కాదు… అలయంలో అడుగడుగునా కూడా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అరుదైన శిల్పాలు కనువిందు చేస్తాయి.

వేసవిలోనూ చల్లగా

స్వామివారి అనుగ్రహ మహిమో, వారి మీద ఉండే చందనం మహిమో కానీ గర్భగుడిలోకి ప్రవేశించగానే మండు వేసవిలో సైతం ఒళ్లు చల్లబడిపోతుందని చెబుతారు. గర్భగుడిలోని స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవకాశం ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. కొండ మీద వెలసిన స్వామి చుట్టూనే కాదు… ఆ కొండ చుట్టూతా ప్రదక్షిణం చేసే అవకాశం ఉండటం మరో విశేషం. తమిళనాట తిరువణ్ణామలై కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా, సింహాచలానికి కూడా గిరిప్రదక్షిణ చేసే విషయం చాలామందికి తెలియదు. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు వేలాదిమంది భక్తులు 32 కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే సింహాచలం కొండని చుట్టి, స్వామిని చేరుకుంటారు.

ఆయనను తల్చుకుంటే చాలు, తమ ఆపదలు తీరిపోతాయని వారి విశ్వాసం. అలా ఆపదలు తీర్చే దైవం కాబ్ట ఆయనను అప్పన్న అని పిల్చుకుంటారట.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version