బాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఎన్నో వేల పాటలు పాడి ప్రేక్షకుల గుండెల్లో స్వరకోకిల గా పేరు సంపాదించిన లతా మంగేష్కర్ గారు నేడు మనల్ని విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధరకం అనే చెప్పాలి. ఇక ఆమె మృతిపై పలువురు సినిమా రంగ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. 28 సెప్టెంబర్ 1929లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్, తల్లి షెవంటి మంగేష్కర్. హిందూ మాత సంప్రదాయాలు పాటించే మరాఠీ కుటుంబంలో ఆమె జన్మించారు.
కాగా ఆమె సోదరీమణుల్లో ఆశా భోంస్లే కూడా ప్రముఖ సింగర్ గా ఎంతో పేరు దక్కించుకున్నారు. ఇక చిన్నప్పటి నుండి చదువుపై లతా గారికి అంతగా శ్రద్ధ ఉండేది కాదట. అంతేకాక సంగీతం పట్ల ఎంతో మక్కువ ఉండడం, మరియు దానిని నేర్చుకునే క్రమంలో ఆమె స్కూల్ కి కూడా సరిగ్గా హాజరయ్యేవారు కాదట. ఆ విధంగా ఆమె విద్యాబ్యాసం స్కూల్ దశలోనే ఆగిపోయింది. అయితే చిన్నవయసులోనే తండ్రితో కలిసి కొన్ని నాటకాల్లో నటించిన లతా గారిని, ఆమెకు సంగీతం పట్ల గల ఆసక్తిని గ్రహించిన తండ్రి దీనానాథ్ ఆమెకు ఆ కళలో శిక్షణ కూడా ఇప్పించారట. ఇక ఇంట్లోని సంతానంలో వారందరిలో లతా గారే పెద్ద కావడంతో, తన సోదరుడు మరియు సోదరీమణుల జీవితంపై ఆమె ఎంతో శ్రద్ధ వహించేవారట.