ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కి సిట్‌ నోటీసులు

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీజనార్దన సంతోష్‌ (బీఎల్‌ సంతోష్‌)కు సిట్‌ నోటీసు జారీ చేసిందని అందులో ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన అడ్వొకేట్‌ శ్రీనివాస్‌కు కూడా సిట్‌ నోటీస్‌ ఇచ్చినట్టు ప్రేమేందర్‌రెడ్డి తన ఇంటరిమ్‌ పిటిషన్‌లో తెలిపారు. బీఎల్‌ సంతోష్‌కు, అడ్వొకేట్‌ శ్రీనివాస్‌కు సిట్‌ ఇచ్చిన నోటీస్‌ ప్రతులను పిటిషనర్‌ తన పిటిషన్‌కు జోడించారు. బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి సమర్పించిన ఈ మధ్యంతర పిటిషన్‌తో బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు జారీ అయిన విషయం బయటపడింది. ఈ నెల 21వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా బీఎల్‌ సంతోష్‌ను సిట్‌ తన నోటీసులో కోరినట్టు బీజేపీ నేత తన మధ్యంతర పిటిషన్‌లో పేర్కొన్నారు.

దర్యాప్తునకు హాజరుకాకపోతే అరెస్ట్‌ చేస్తామని కూడా నోటీసులో ప్రస్తావించారని అందులో ల్లడించారు. సిట్‌ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రేమేందర్‌రెడ్డి కోరారు. ‘సాక్ష్యాధారాలను తారుమారు చేయకూడదు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలి. ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు హాజరుకావాలి. కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందజేయాలి. ఇతర నిందితులు ఉంటే, వాళ్లను పట్టుకునేందుకు సహకరించాలి. ఏ ఆధారాలను ధ్వంసం చేయకూడదు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌లోని ఏ సమాచారాన్నీ మార్పులు చేయకూడదు. ఇతర మొబైల్‌, ల్యాప్‌టాప్‌లు ఉంటే, వాటిని దర్యాప్తునకు తీసుకురావాలి. దర్యాప్తు సమయంలో దర్యాప్తు అధికారి ఇతర ఆంక్షలు విధించొచ్చు. దర్యాప్తునకు హాజరుకాకపోతే 41ఏ(3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసేందుకు వీలున్నది’ అని బీజేపీ ఐఏకు జోడించిన సిట్‌ నోటీసు పత్రాల్లో ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version