మయన్మార్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. సైనిక పాలనలో ఉన్న ఈ దేశంలోని మధ్య సాగింగ్ ప్రాంతంలో లెట్యట్కోనే అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలోని బౌద్ధమఠంలో నిర్వహిస్తోన్న పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కాల్పులు జరిపిన మయన్మార్ సైన్యం స్పందించింది.
ఆ పాఠశాలలో నక్కిన రెబల్స్.. దాడులు చేస్తుండటం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని మయన్మారం సైన్యం వెల్లడించింది. బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ గ్రూపునకు చెందిన రెబల్స్ ఆయుధ రవాణా చేస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంలోనే తనిఖీలు చేయడానికి వచ్చిన సైన్యం హెలికాప్టర్లపై రెబల్స్ దాడి చేయడంతో ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని చెప్పింది.
ఈ దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని వెల్లడించింది. ఈ కాల్పుల్లో చనిపోయిన పిల్లల మృతదేహాలను సైన్యం అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ టౌన్‌షిప్‌నకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.