ప్రపంచంలోని అన్ని ప్రాణాల్లోకల్లా మణిషి అనే ప్రాణికే నవ్వే అనుభూతిని కలిగించాడు ఆ దేవుడు. మనుషులకు తప్ప మరే జీవికి నవ్వడం, ఏడ్వడం తెలియదు. కాకపోతే వాటి భావాలను మాత్రం వ్యక్తపరుస్తుంటాయి. మనిషి అలాకాదు ఏ భావాన్నైనా ముఖకవళికలలో చూపించగలరు. అలాంటి నవ్వుతో ఆరోగ్యం ముడిపడుంది. నవ్వితే మాకేంటి అనుకునేవారికి ఈ విషయాలు తెలుసుకోవాలి.
నవరసాలు పండించడంలో మనిషి నేర్పరి. ఏ భావాన్నైనా క్షణాల్లో చూపించగలడు. అయితే అన్ని రసాల్లో కల్లా హాస్యరసం గొప్పదంటారు. ఎందుకంటే ఒకరి నవ్వు ఎదుటివారికి ఆనందం కలిగిస్తుంది. పక్కవారితో బంధం ఏర్పరుచుకుంటుంది. చుట్టు ఉన్నవాళ్లు నా అన్న భావన తీసుకువస్తుంది. అలాంటి నవ్వు తమతో పాటు ఇతరులు ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనిషికి ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా వెంటనే ముఖకవళికలలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్ శరీరానికి ఎంత అవసరమో, నవ్వుకూడా అంతే అవసరం. బిగ్గరగా నవ్వడం వల్ల ఉదరం, కాళ్లు, చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసినా ఫలితం దక్కుతుంది. బరువు అధికంగా ఉన్నవారు తగ్గుందుకు నానాఅవస్థలు పడుతుంటారు. వాటన్నింటినీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వితే చాలు బరువు తేలికగా తగ్గవచ్చు. శరీరానికి అందించే ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే రోజుకు కనీసం గంటపాటు నవ్వండి. దీంతో శారీరకమైన లాభాలు ఉన్నాయి. అంతేకాదు నవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్ని కూడా అందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు.
మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గర సంబంధం ఉన్నట్లే శరీరంలో జరిగే పలు రసాయన మార్పులకి కూడా సంబంధం ఉంటుంది. శరీరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితన్నాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు తెలిపారు. రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటును క్రమబద్దీకరించుకునేందుకు మందులతో పనిలేకుండా ప్రతిరోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. హార్మోన్లలో అసమానతల కారణంగా ఒత్తిడి, ఆంధోళనకు గురవుతారు. దీంతో నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్దీకరిస్తుంది. మనసారా నవ్వడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతుంది.
నవ్వు సీరమ్ కార్టిసాల్‌ను తగ్గించి లింఫోసైట్స్ పనితనాన్ని పెంచుతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజువయింది. నవ్వు వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి నుంచి కాపాడే ప్రొటీన్లు, గామ్మా-ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. మానసిక ప్రశాంతత వల్ల శరీరం తన పూర్వస్థితిని పొందుతుంది. చురుకుగా ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యంలో మంచి అభివృద్ధిని గమనించవచ్చు.