తెలంగాణలో మైనారిటీల జనాభా ఎంత ఉందనే వివరాలు తమ వద్ద లేవని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తెలంగాణలో మైనారిటీ జనాభా, రిజర్వేషన్లపై నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనాభా లెక్కల్లో మతాన్ని గుర్తించినా మైనారిటీ అనే పదాన్ని గుర్తించలేదని ఆమె వెల్లడించారు. 2011లో చివరిసారిగా జనాభా లెక్కలు చేపట్టామని, 2014లో తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రానికి సంబంధించి మతాల వారీ గణాంకాలు లేవని వివరించారు.
మరోవైపు బెంగళూర్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడి రూ.156.38 కోట్లతో 512 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వేసే పనులు 2022, సెప్టెంబరు 23న ప్రారంభమయ్యాయని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.