రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. బాలకృష్ణ హోస్టు చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ కార్యక్రమానికి ఆయన హాజరైన సంగతి తెలిసిందే. గతవారం తొలి ఎపిసోడ్ రాగా ఈవారం రెండో ఎపిసోడ్ విడుదలైంది.
‘ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవరుచుకున్నా. పాలిటిక్స్‌లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే దాన్నీ ఆయన నుంచే నేర్చుకున్నా. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అన్నయ్య నుంచి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం.‘అని అన్నారు పవన్.
‘అభిమానం వేరు.. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నా’ అని చెప్పుకొచ్చారు పవన్.