ఏపీలో ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ, నేటివరకు ఉచితంగా ఇసుక సరఫరా జరగడం లేదు. బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగగా, అందులో ఉచిత ఇసుక పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇసుక బకాసురులు ప్రకృతి వనరులపై కన్నేసినట్లు తెలుస్తోంది.ఇసుక మాఫియా ఒక్కసారిగా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడని ఓ వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని సనపల సురేష్ అనే వ్యక్తిని రాగోలు వద్ద కొందరు అడ్డుకున్నారు.ఆ సమయంలో సురేష్ కారులో వేగంగా వెళ్లడంతో ఇద్దరికి గాయాలయ్యాయి..దీంతో బలగ కూడలి వద్ద మరోసారి సురేష్ కారును మళ్లీ టీడీపీ నేతలు అడ్డుకున్నారు.సురేష్ కారును ఆపకపోవడంతో దాడికి దిగి కారు అద్దాలు పగలగొట్టి,కారును ధ్వంసం చేశారు.ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నానని తనపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు దాడి చేశారని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నాడు.