మనం నిత్యం రోడ్ల వెంబడి ఎంతోమంది యాచకులను చూస్తుంటాం. కానీ ఏం చేయం. కానీ ఆయన మాత్రం మనలాగా నాకేంటి అని ఊరుకోలేదు. ఏదైనా చేయాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఫౌండేషన్ పెట్టాడు. ఒక్కడితో మొదలన ఫౌండేషన్ ఇప్పడు 250మంది వాలంటీర్లతో సేవలందిస్తోంది. దీన్ని ప్రారంభించింది డబ్బున్న వ్యక్తి కాదు. ఓ సాధారణ ఉద్యోగి. ఆయనే నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన నవీన్ చంటి. ఆయన విద్యుత్ ఉద్యోగి.
2016లో ఆయన ప్రారంభించిన నిజామాబాద్ ఫుడ్ బ్యాంకు ఎంతో మందికి కడుపు నింపుతోంది. ఉదయం 7గంటల కల్ల ఆహారాలు వండి 9గంటల నుంచి యాచకులకు, అనాథలకు నిత్యం ఆహారం అందిస్తారు. మూడేళ్లుగా ఎంతోమందికి భోజనాలు పెడుతున్నారు. ఇక కరోనా టైమ్ లో కూడా వలస కార్మికులకు, పేదోళ్లకు నిత్యం ఆహారం పంపిణీ చేసి వారి కడుపులు నింపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ కు చెందిన సుమారు లక్షమందికి వీరు ఫుడ్‌బ్యాంకు వాహనాల ద్వారా దారి పొడవునా ఆహారాలు అందించారు.
ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా సోకి ఐసోలేషన్ లో ఉంటున్న ఎంతో మందికి వారు ఆహారం అందిస్తున్నారు. పని దొరకని చాలా కుటుంబాలకు నిత్యం వారే అన్నం పెడుతున్నారు. ఆపదొస్తే తామున్నామంటూ ఉమ్మడి జిల్లాలో విస్తృత సేవలందిస్తున్నారు. ఏ సమయంలోనైనా సరే సాయం కోరి వస్తే అండగా నిలబడుతున్నారు. నిత్యం ప్రజాసేవలో తమ ఇళ్లను కూడా మరుస్తున్నారు ఈ ఫౌండేషన్ వలంటీర్లు.