సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అయితే దీనికి పోటీగా త్వరలో యాపిల్ కూడా నూతనంగా సెర్చ్ ఇంజిన్‌ను అందుబాటులోకి తేనుందని తెలిసింది. అయితే ఆ సెర్చ్ ఇంజిన్ యాపిల్‌కు చెందిన సఫారి బ్రౌజర్‌లో పనిచేస్తుంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్‌బుక్‌లు, ఐమ్యాక్‌లలో సఫారి బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే ఇకపై గూగుల్ కాకుండా యాపిల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వస్తాయి.
కాగా యాపిల్ డెవలప్ చేస్తున్న సెర్చ్ ఇంజిన్ కేవలం యాపిల్ ప్రొడక్ట్స్ ను వాడేవారికి మాత్రమే లభిస్తుంది. ఇక అది ఇతర యూజర్లకు అందుబాటులో ఉండదు. అలాగే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వచ్చిన మాదిరిగా యాపిల్ సెర్చ్ ఇంజిన్ ఫలితాల్లో యాడ్స్ రావు. కాగా ప్రస్తుతానికి యాపిల్ ప్రొడక్ట్స్‌లో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగులే ఉంది. ఇందుకు గాను గూగుల్ యాపిల్‌కు ఏటా బిలియన్ల డాలర్లను చెల్లిస్తుందని తెలిసింది. అయితే ఈ రెండు సంస్థల మధ్య ఉన్న ఈ సీక్రెట్ డీల్ గురించి బయటకు తెలియడంతో దాని నుంచి తప్పించుకునేందుకు యాపిల్ సొంతంగా సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇక సెర్చ్ ఇంజిన్‌కు గాను ఉద్యోగం చేయడం కోసం ఇప్పటికే యాపిల్ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కచ్చితంగా త్వరలోనే యాపిల్ తన సొంత సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేస్తుందని తెలిసింది. ఇక త్వరలో అందుబాటులోకి రానున్న ఐఓఎస్ 14తోపాటు ఐప్యాడ్ ఓఎస్, మాక్ ఓఎస్‌లలోనూ ఆ సెర్చ్ ఇంజిన్‌ను యాపిల్ అందిస్తుందని తెలిసింది. దీనిపై ఆ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.