కొత్తగా పాస్‌పోర్టుకు అప్లై చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇకపై ఇ-పాస్‌పోర్టులు ఇస్తారు. అంటే.. ఇప్పటి వరకు ప్రింట్ రూపంలో పాస్‌పోర్టులను ఇచ్చేవారు కదా.. కానీ ఇకపై ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ కలిగిన ఇ-పాస్‌పోర్టులను ఇస్తారన్నమాట. అంటే వాటిని డిజిటల్ రూపంలో వాడుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 20వేల అఫిషియల్, డిప్లొమాటిక్ ఇ-పాస్‌పోర్టులను జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా ఆ పాస్‌పోర్టులను జారీ చేశారు. కానీ ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ కేంద్రం ఇ-పాస్‌పోర్టులను జారీ చేయనుంది.
అయితే ఇ-పాస్‌పోర్టులను జారీ చేసేందుకు గాను అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం పలు ఏజెన్సీలతో చర్చిస్తోంది. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 36 పాస్‌పోర్టు ఆఫీసుల్లో ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. వాటి సహాయంతో గంటకు సుమారుగా 10వేల నుంచి 20వేల వరకు ఇ-పాస్‌పోర్టులను జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల పెద్ద ఎత్తున చాలా మందికి పాస్‌పోర్టులను ఇవ్వవచ్చు. అలాగే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి బోర్డింగ్ వేగవంతం అవుతుంది. పాస్‌పోర్టును కోల్పోవడం, మరిచిపోవడం.. అనే ఇబ్బందులు తలెత్తవు. టిక్కెట్ల బుకింగ్ కూడా వేగవంతం అవుతుంది.
ఇక కొత్తగా పాస్‌పోర్టులను అప్లై చేసేవారికి మాత్రమే కాకుండా.. రెన్యువల్ చేసే వారికి కూడా ఇ-పాస్‌పోర్టులను కేంద్రం అందివ్వనుంది. అయితే ఈ విధానం పూర్తిగా సురక్షితమైందని, దీని వల్ల పౌరుల పాస్‌పోర్టుల వివరాలకు ఎలాంటి ముప్పు ఉండదని కూడా కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో అతి త్వరలోనే పౌరులకు ఇ-పాస్‌పోర్టులను ఇవ్వనున్నారు.