దేశంలోని దాదాపు అన్ని టెలికాం కంపెనీలు నష్టాల పేరు చెప్పి గతంలోనే తాము వినియోగదారులకు అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం విదితమే. అయితే త్వరలో మరోసారి ఆ ధరలు పెరగనున్నాయి. కాల్స్, డేటా ధరలు 10 రెట్ల వరకు పెరగనున్నాయని తెలుస్తోంది. ఇకపై ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లకు అందిస్తున్న కాల్స్, డేటా చార్జిలను పెద్ద ఎత్తున పెంచనున్నాయని తెలిసింది.
టెలికాం కంపెనీలు తీవ్రమైన నష్టాల్లో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే చార్జిలను గనక పెంచితే 1 జీబీ కనీస ధర ప్రస్తుతం రూ.3.5 ఉండగా, వొడాఫోన్ ఐడియాలో అది ఇకపై రూ.35 అవుతుంది. అదే ఎయిర్‌టెల్ 1జీబీ కనీస చార్జిని రూ.30 వరకు వసూలు చేస్తుందని సమాచారం. అలాగే జియో అయితే 1 జీబీకి కనీసం రూ.20 చార్జి చేయాలని చూస్తోంది.
అయితే కాల్స్, డేటా చార్జిల పెంపుపై ఇప్పటికే టెలికాం కంపెనీలు ప్రతిపాదనలు పంపగా వాటికి నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇక ట్రాయ్ ఆమోదిస్తే ఆయా చార్జిలు ఎప్పుడైనా పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాల్స్, డేటా చార్జిలు గనక పెరిగితే వినియోగదారులు నెలవారీ ప్లాన్లకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆయా చార్జిలు ఎప్పుడు పెరుగుతాయో చూడాలి..!