యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్ వివరాలను వెల్లడించారు. ఆ ప్రకటన వస్తే.. విద్యార్థులు ఇక ఏకకాలంలో రెండు భిన్నమైన డిగ్రీ కోర్సులను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.
అయితే రెండు డిగ్రీ కోర్సులను ఒకేసారి చదవాలనుకునే విద్యార్థులు ఒక కోర్సును రెగ్యులర్‌గా చేయాలి. మరొక కోర్సును ఆన్‌లైన్ లేదా డిస్టాన్స్ లెర్నింగ్‌లో పూర్తి చేయాలి. కాగా 2012లోనే ఇందుకు సంబంధించి ఒక ప్రతిపాదన యూజీసీ ముందుకు వచ్చినా.. అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. కానీ ప్రస్తుతం ఈ విధానానికి త్వరలో ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలను చదవవచ్చు.
ఇలా రెండు డిగ్రీలను ఒకేసారి పూర్తి చేయడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఏదైనా అంశంలో నైపుణ్యాన్ని పెంచుకోవడం మరింత సులభతరం అవుతుందని అంటున్నారు.