సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త్వరలో తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇకపై భూకంపాలను ఫోన్లు ముందుగానే పసిగట్టి యూజర్లను హెచ్చరిస్తాయి. దీంతో వారు సెకన్ల వ్యవధిలోనే వేగంగా స్పందించి భూకంపాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో గూగుల్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
కాలిఫోర్నియాలో భూకంపాలను పసిగట్టే సీస్మోమీటర్లను అమర్చారు. అవి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే చిన్నపాటి యాక్సలరోమీటర్లకు కనెక్ట్ అవుతాయి. ఫోన్లు భూకంపానికి చెందిన తీవ్రతను పసిగడితే వాటి నుంచి సిగ్నల్స్ సదరు సీస్మోమీటర్లకు వెళ్తాయి. అక్కడ ఫోన్ల నుంచి వచ్చే అలాంటి సిగ్నల్స్ స్వీకరించే సర్వర్లు సెకన్ల వ్యవధిలోనే సమాచారాన్ని విశ్లేషించి నిర్దిష్టమైన ప్రదేశంలో భూకంపం వస్తుందా, లేదా అన్న వివరాలను వెంటనే ఫోన్ యూజర్లకు పంపుతాయి. దీంతో యూజర్లు అలర్ట్ అయి భూకంపం నుంచి తప్పించుకునేందుకు వీలు కలుగుతుంది.
గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రస్తుతం కాలిఫోర్నియాలో పరీక్షిస్తున్నప్పటికీ అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఇందుకు గాను కాలిఫోర్నియాలోనే 700 వరకు సీస్మోమీటర్లను అమర్చారు. కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. షేక్ అలర్ట్ అనే ఆ ఫీచర్ ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.