తెలంగాణ మందుపై ఏపీ మందుబాబులు మనసు పారేసుకుంటున్నారు. దీంతో ఏపీలో మద్యం దుకాణాలకు గిరాకీ తగ్గగా…తెలంగాణలో కాసుల గలగలలతో కళకళలాడుతున్నాయి. సరిహద్దు దాటి వచ్చి మరీ రోజూ సేవించి పోతుండటం గమనార్హం. తెలంగాణకు సమీపంలో ఉన్న నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలో ఈ తరహా మంద్య వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ఏపీ ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు నందిగామ వీరులపాడు మండలాల వాసులంతా తెలంగాణ మద్యం షాపులకు క్యూ కడుతున్నారట.
అలాగే తెలంగాణ ప్రాంతాలకు సరిహద్దులోని ఉన్న ఏపీ గ్రామాల్లోని బెల్ట్‌షాపు నిర్వాహాకులు కూడా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారట. ఏపీలో మద్యం దుకాణాలు రాత్రి 8గంటలకే క్లోజ్ చేస్తుండగా తెలంగాణలో రాత్రి 11గంటల వరకు కూడా తెరిచే ఉంటున్నాయి. అలాగే ఏపీలో మద్యం ధరలకు తెలంగాణలో మధ్య ధరలకు క్వార్టర్ కు రూ.30-40 తేడా ఉంటోంది.
ఇక ఫుల్ బాటిల్ కు అయితే ఏకంగా 150-200 వరకూ తేడా ఉండటం గమనార్హం. ఫలితంగా తెలంగాణలో చీప్‌గా దొరికే మద్యం వైపే ఏపీ మందుబాబులు మొగ్గుచూపుతున్నారట. తాగేవాడికి ఏ ప్రాంతం మందైతే ఏంటి..కిక్కు ఎక్కటమే కావాల్సింది అంటూ మందుబాబుబు తాగుడు వేదాంతం చెబుతుండటం గమనార్హం. వాస్తవానికి వారు చెబుతున్నది నిజమే కదా అంటూ ఏపీ ఎక్సైజ్ అధికారులు కూడా ముక్తాయిస్తున్నారట.
మద్యం పాలసీలో మార్పులు తీసుకురావడంతో చాలా వరకు అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీకి సరిహద్దులో ఉన్న తెలంగాణ వైన్‌షాపులకు విపరీతంగా గిరాకీ పెరిగినట్లు సమాచారం. ఏపీలో నియంత్రణ తెలంగాణ ఎక్సైజ్ కు ఈవిధంగా లాభంగా మారిందని మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. దీంతో తెలంగాణలోని వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వ్యాపారం వర్ధిల్లుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట.