ఆసియా కప్ లో భాగంగా భారత్ తో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పెసర్ షాహిన్ ఆఫ్రిది దూరం కాగా, తాజాగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ వసీమ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సెషన్ లో పాల్గొన్న వసీమ్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే వెన్ను నొప్పి వచ్చింది.
దీంతో జట్టు సిబ్బంది వెంటనే అతన్ని ఐసిసి అకాడమీకి తరలించి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రిపోర్ట్స్ లో వసీమ్ కు వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి అతను ఆసియా కప్ కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ కు బిజీ షెడ్యూల్ ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తో వరుస సిరీస్ లు ఆడనుంది. ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ లో ఆడనుంది. ఇలా బిజీ షెడ్యూల్ కారణంగానే ప్లేయర్లు గాయాల పాలవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.