ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీని ముందుగా భారత్ లోనే నిర్వహించాలని అనుకున్నారు. కానీ లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఐపీఎల్ వేదికపై సందిగ్ధత నెలకొంది. 2009 సంవత్సరం లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్ లోనే ఐపిఎల్ ను కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ ను స్వదేశంలో నిర్వహించాలా? విదేశానికి తరలించాలా? అని బీసీసీఐ లెక్కలు వేసుకుంది.
వాస్తవానికి మార్చి 22 నుంచి మే 30 మధ్య ఐపిఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడని నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహించే అవకాశాలను కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.