ఐపీఎల్ – 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ దూసుకెళ్తోంది. క్రీజులోకి దిగిన ప్లేయర్స్ తమ ఆటతో దుమ్ములేపుతున్నారు. వారే రికార్డులు క్రియేట్ చేస్తూ.. వాళ్లే తమ రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఐపీఎల్లో హల్చల్ సృష్టిస్తారు. తాజాగా జరిగిన మ్యాచులో మళ్లీ సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టేసింది. ఈ సీజన్లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకుంది. దిల్లీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ జట్టు 67 పరుగులు తేడాతో విజయం లభించింది. మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి వరుసగా మూడు మ్యాచుల్లో 250పైగా స్కోరు చేసిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు.
హెడ్ – అభిషేక్ తొలి వికెట్‌కు 131 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 89 పరుగులు, అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 46 పరుగులు చేశాడు. పవర్‌ప్లే(6 ఓవర్లు)లో ఏకంగా 125 పరుగులు సాధించి రికార్డ్ కూడా సృష్టించింది. మరోవైపు దిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్(65), అభిషేక్ పోరెల్(42), పంత్(44), పృథ్వీ షా(16) పరుగులు చేశారు. టి నటరాజన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్ మార్కండే నితీశ్ రెడ్డి తలో రెండు, వాషింటన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.