స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌ముల‌కు డేవిడ్ వార్న‌ర్ ఒక్క‌డినే బాధ్యున్ని చేశారా ?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 సీజ‌న్‌లో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ ప్ర‌దర్శ‌న ఏమాత్రం బాగాలేదు. ఆడిన 6 మ్యాచ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క‌టే మ్యాచ్‌లో గెలిచింది. దీంతో జట్టు యాజ‌మాన్యం కెప్టెన్‌గా వార్న‌ర్‌ను త‌ప్పించింది. విలియ‌మ్స‌న్‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న బాగా లేన‌ప్పుడు కెప్టెన్‌ను మార్చ‌డం అన్న‌ది స‌హ‌జంగానే ఎక్క‌డైనా జ‌రిగే ప్ర‌క్రియే. కానీ సీజ‌న్ మ‌ధ్య‌లో ఉన్న‌ప్పుడు కెప్టెన్‌ల‌ను మార్చ‌డం వ‌ల్ల ఆ జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.

Was David Warner solely responsible for the Sunrisers Hyderabad defeat?

క్రికెట్ మ్యాచ్‌లు అన్నాక జ‌ట్టులో ఒక్క ప్లేయ‌ర్ కాదు, టీమ్ మొత్తం స‌రిగ్గా ఆడాలి. అప్పుడే జ‌ట్టు విజ‌యం సాధిస్తుంది. స‌మిష్టిగా అంద‌రు ప్లేయ‌ర్లు ఆడిన‌ప్పుడే జ‌ట్టు విజ‌య‌ప‌థంలో కొన‌సాగుతుంది. అయితే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల‌లో స‌మిష్టిగా ఆడ‌డం అనే ప్ర‌య‌త్నం కొర‌వ‌డింది. ఎవ‌రో ఒక‌రో, ఇద్ద‌రో ప్లేయ‌ర్లు రాణించారు త‌ప్పితే జ‌ట్టు స‌మిష్టిగా రాణించిన దాఖ‌లాలు లేవు. అందువ‌ల్లే స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి ప‌థంలో ప్ర‌యాణిస్తుంద‌ని సుల‌భంగా తెలుస్తుంది.

జ‌ట్టు వ‌రుస ఓట‌ముల పాలు అయితే అందుకు కెప్టెన్‌నే బాధ్యున్ని చేయ‌డం అనేది స‌మంజ‌సం కాదు. ప్లేయ‌ర్లు స‌రిగ్గా ఆడ‌న‌ప్పుడు కెప్టెన్ కూడా ఏమీ చేయ‌లేడు. గ‌త సీజ‌న్‌లో చెన్నై అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అయిన‌ప్ప‌టికీ ధోనీని ఆ స్థానం నుంచి త‌ప్పించ‌లేదు. మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చారు. అయితే వార్న‌ర్ ధోనీ అంత‌టి ప్లేయ‌ర్ కాక‌పోయినా మెరుగైన బ్యాట్స్‌మ‌న్‌. ఈ సీజ‌న్‌లో అత‌ను మ‌రీ అంత నిరాశ ప‌రిచే ప్ర‌ద‌ర్శ‌న కూడా చేయ‌లేదు. ఒక మోస్త‌రుగా ఫ‌ర్వాలేద‌నిపించాడు. అయితే స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టులో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని, అందువ‌ల్ల వార్న‌ర్‌ను కెప్టెన్‌గానే కాక తుది జ‌ట్టులోనూ త‌ప్పించార‌ని కొంద‌రు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి కేన్ విలియ‌మ్స‌న్‌ను కెప్టెన్‌గా చేశాకైనా హైద‌రాబాద్ అదృష్టం మారుతుందేమో చూడాలి.