టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గత కొన్నేళ్లుగా షమీతో దూరంగా ఉంటున్న హసీన్ జహాన్.. షమీ తనను కట్నం కోసం వేధించేవాడని, అతడికి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అంతేగాక, అతడిపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణలో గత నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదని పేర్కొంటూ తాజాగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతడి అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పట్లో కోల్‌కతా పోలీసు మహిళా ఫిర్యాదు విభాగం.. షమీ, అతడి సోదరుడిని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు.. క్రికెటర్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ 2019 సెప్టెంబరులో సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో హసీన్ ఈ ఏడాది మార్చిలో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. షమీ అరెస్టు వారెంట్‌పై స్టేను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హసీన్ తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లింది.