రాజ్‌కోట్‌లో వస్తుందనుకున్న ‘మహా’ తుఫానైతే రాలేదు. కానీ.. తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపు లెక్కని 1-1తో సరిచేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిచింది. చాహల్ (2/28), దీపక్ చాహర్ (1/25), వాషింగ్టన్ సుందర్ (1/25)ల బౌలింగ్ ప్రదర్శనతో మొదట బంగ్లాను 153/6కే కట్టడి చేశారు. చేధనలో రెచ్చిపోయిన రోహిత్ (85; 43 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులు) విజృంభించడంతో లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించగలిగారు.
రాజ్‌కోట్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతా తానై నడిపించాడు. అద్భుతమైన ప్రదర్శనకు రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కెరీర్‌లో 100వ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. కాగా, భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (1/44) ఒక్కడే నిరాశపరిచినప్పటికీ స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్ బంగ్లాను దెబ్బతీశారు. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి బంగ్లా పతనాన్ని చవిచూశారు.