ఈ ఏడాది ఐపీఎల్ లో అందరినీ అమితంగా ఆకర్షించిన టీం ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ అని బల్లగుద్ది చెప్పవచ్చు. 2023 ఐపీఎల్ లో టేబుల్ లో అడుగు బాగాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2024లో టాప్ 2 లో నిలిచింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ రావడం.
2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియాకి అందించిన పాట్ కమిన్స్ ని 20 కోట్లకు పైగా వెచ్చించి వేలంలో తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్.
పాట్ కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరించినప్పటినుండి హైదరాబాద్ ఖాతాలో మంచి మంచి విజయాలు నమోదయ్యాయి.
ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 287/3 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. అంతేకాదు ఒకటి కంటే ఎక్కువసార్లు 250కి పైగా స్కోరును ఇదే సీజన్లో సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల వరద సృష్టించారు. వీరిద్దరూ కలిసి బ్యాటింగ్ లో రికార్డు భాగస్వామ్యాలను నెలకొల్పారు. వీరికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మొదలగు బ్యాటర్లు తోడు రావడంతో.. ఈ ఏడాది హైదరాబాద్ జట్టు ఫైనల్ వరకు చేరుకోగలిగింది.
ఫైనల్ లో మాత్రం.. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై కప్పును మిస్ చేసుకుంది. అయితే 2025లో సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు.