రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా మద్దతు పలికాడు. రెజ్లర్లు న్యాయం కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నాడు. అథ్లెట్ అయినా.. కాకపోయినా.. ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంటుందని నీరజ్ ట్వీట్ చేశాడు.
“మన అథ్లెట్లు న్యాయం కోరుతూ వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగించింది. వారు మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, మనల్ని గర్వపడేలా చేయడానికి చాలా కష్టపడ్డారు. ప్రతి వ్యక్తి సమగ్రతతో పాటు గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. అది క్రీడాకారుడైనా కాకపోయినా కూడా. ఇప్పుడు జరుగుతున్న విషయం మరెప్పుడూ జరగకూడదు. ఇది సున్నితమైన సమస్య. నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి” అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023