పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం రోజున మహిళల మహా పంచాయత్ పేరుతో రెజ్లర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకున్న దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు. చాలాకాలంగా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన చేస్తున్న వారు ఆదివారం ఆంక్షలను దాటుకుని పార్లమెంటువైపు బయలుదేరేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియాలను బలవంతగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారినీ బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. ఆ వెంటనే జంతర్‌మంతర్‌ను పోలీసులు ఖాళీ చేయించారు.
తమను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 23 నుంచి రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు బ్రిజ్‌భూషణ్ పార్లమెంటులో కూర్చున్నారని, దేశం కోసం పతకాలను సాధించిన తమను రోడ్లపై ఈడ్చుకెళ్లారని, ఇది భారత క్రీడారంగానికి చీకటి రోజని సాక్షి మలిక్ ధ్వజమెత్తారు.
ఈ ఘటనపై స్పందించిన విపక్షాలు బీజేపీ ప్రభుత్వానికి అహంకారం మరింత ఎక్కువైందని మండిపడ్డారు. మహిళా క్రీడాకారులపై కనికరం లేకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.