కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం పసిడి ముద్దాడడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ పతకం తనకెంతో ప్రత్యేకమని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడు సార్లు పతకాలు సాధించడంతో ఈ గేమ్స్‌లో అన్ని రకాల పతకాలు పూర్తి చేశానని చెప్పింది. అందుకే ఇది తనకు ప్రత్యేకమని పేర్కొంది.
కాగా, సింధు 2014లో తొలిసారి కాంస్యం గెలుపొందగా 2018లో రజతం కైవసం చేసుకుంది. ఈసారి ఏకంగా తుదిపోరులోనే విజయం సాధించడంతో స్వర్ణం పొందింది. ఇక బంగారు పతకం అందుకున్న అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సింధు ఈ వ్యాఖ్యలు చేసింది.
‘నాలుగేళ్లకోసారి వచ్చే ఈ కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం కైవసం చేసుకోవడం ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని ఎక్కడ ఉంచుతానని అడిగితే ఒలింపిక్స్ పతకాల నడుమ పెడతానని చెప్తాను. ఎందుకంటే భారత దేశం తరఫున ఆడటం, పతకాలు సాధించడం అంటే నాకెంతో ఇష్టం. అందుకే ఇది చాలా ప్రత్యేకం. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
అనంతరం ప్రధాని మోదీ ఆమెను ‘ఛాంపియన్లకే ఛాంపియన్’ అని ప్రత్యేకంగా ప్రశంసించడంపై స్పందిస్తూ.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది. మోదీ ఏం చెప్పినా దాన్ని కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తానని పేర్కొంది. ఈ పోటీల కోసం తాను బాగా కష్టపడ్డానని, తన కోచ్ కూడా మెరుగైన శిక్షణ ఇచ్చాడని చెప్పింది. ఈ సందర్భంగా తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకు కృషి చేసిన సహాయక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.