టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి రిటైర్ కావడంతో ఇంగ్లండ్లో టీమిండియాకు ఎవరు సారధ్యం వహిస్తారనే చర్చ జోరందుకుంది. స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శుబ్ మన్ గిల్ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో రాహుల్, బుమ్రా ఇద్దరూ గతంలో భారత జట్టుకు సారధ్యం వహించారు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీసులో కెప్టెన్ గా రాహుల్ ఆకట్టుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులకు సారధ్యం వహించిన బుమ్రా కూడా తనలో అద్భుతమైన సారధి ఉన్నాడని నిరూపించుకున్నాడు. గిల్, పంత్ ఇప్పటి వరకు టెస్టుల్లో సారధ్య బాధ్యతలు నిర్వర్తించలేదు. టీ 20 ఫార్మాట్ లో కెప్టెన్సీ చేసి ఫర్వాలేదనిపించారు. అయితే ఇంగ్లండ్ సిరీస్ లో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కుర్రాళ్లకే కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. బీసీసీఐ వర్గాల ప్రకారం, ఇంగ్లండ్ సిరీసులో టీమిండియా టెస్టు పగ్గాలను శుభ్ర్మన్ గిల్ కి అందజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కూడా గిల్ సారధ్యంలోని గుజరాత్ టైటైటాన్స్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.