ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గామ్ లో దాడి జరిగితే.. మే 07న రాత్రి 1గంటల సమయంలో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ సైనికులు దాడి చేశారు. ఇలా భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ కాల్ రావడం కలకలకం రేపింది.
తిరుపతి కి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ గాజుల వ్యాపారం చేస్తుంటాడు. తాను తన బైకు పై తిరుమలకు వెళ్తుండగా.. 92 32925 27504 నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామని హెచ్చరించారు. దీనిపై త్రిలోక్ కుమార్ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించారు. సీఐ రామ్ కిషోర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోందని.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.