డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత కొద్ది రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రోజు అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు, దిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తోపులాటలో అధికారులు తమపై దాడి చేస్తూ.. దూషించారని నిరసన తెలుపుతున్న అథ్లెట్లు ఆరోపించారు. ఈ ఘర్షణలో రెజర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌కు గాయాలయ్యాయి.
మాల్వియా నగర్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి.. రెజర్ల కోసం మడత మంచాలు తీసుకొచ్చారు. వారికి అవి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాటిని అనుమతించలేదు. అయినా నిరసన మద్దతుదారులు, సోమనాథ్ అనుచురుల.. ట్రక్కు నుంచి పడకలను బయటకు తీయడానికి ప్రయత్నించారట. ఈ క్రమంలోనే రెజర్లు-సోమనాథ్ అనుచురులకు.. పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో సోమనాథ్ భారతితో పాటు మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.