ఐసీసీ వరల్డ్ కప్ 2019 నుంచి సౌతాఫ్రికా జట్టు దాదాపుగా నిష్క్రమించింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు లేవు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 నుంచి సౌతాఫ్రికా జట్టు దాదాపుగా నిష్క్రమించింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు లేవు. ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడిన సఫారీ జట్టు 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 1 మ్యాచ్ రద్దు కాగా, 1 మ్యాచ్‌లో గెలిచింది. అది కూడా పసికూన ఆఫ్గనిస్థాన్ మీద. ఈ క్రమంలో సౌతాఫ్రికాకు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఆ మూడింటిలో గెలిచినా ప్రస్తుతం ఉన్న 3 పాయింట్లకు మరో 6 పాయింట్లు తోడైతే మొత్తం 9 పాయింట్లు అవుతాయి. అయినా ఆ జట్టు ఆ స్థితిలోనూ సెమీస్‌కు వెళ్తుందని చెప్పలేం. దేవుడు కరుణించి ఆదుకుంటే, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సౌతాఫ్రికా ఇక నాకౌట్ స్టేజ్‌కు వెళ్లే అవకాశం లేదు.
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియాలు గత కొద్ది రోజులుగా టాప్ 4 స్థానాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఇక ఆ జట్లకు మరికొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, రెండు మ్యాచ్‌లలో ఆ జట్లు విజయం సాధించినా 10 నుంచి 12, 14 పాయింట్లతో ఆ జట్లు సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి స్థితిలో సౌతాఫ్రికా ఆ జట్లను వెనక్కి నెట్టి సెమీస్‌లోకి ప్రవేశిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. అలాగే మరో జట్టు పాకిస్థాన్‌ది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. దీంతో ఆ జట్టు కూడా సెమీస్ ప్రవేశించడం చాలా కష్టమనే చెప్పవచ్చు.
నిజానికి గతంలో ఏ వరల్డ్ కప్ జరిగినా సరే సౌతాఫ్రికా ఒక ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. అయితే ప్రతి వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ ఏదో ఒక అనూహ్య కారణంతో ఆ జట్టు ప్రపంచ కప్ నుంచి ఔట్ అవుతూ వస్తోంది. కానీ ఈ సారి మాత్రం చాలా పేలవమైన ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడమే కాదు, భారత్, న్యూజిలాండ్ లాంటి టీంలకు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సారి మరింత విషాదకరంగా సఫారీలు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించనున్నారు. అయితే ఉన్న పరువు కాపాడుకోవాలంటే.. ఆ మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా చక్కని ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. లేదంటే.. అభిమానుల ఆక్రోశానికి బలి కావల్సి వస్తుంది..!