10 రోజుల్లో 4 మ్యాచ్‌లు.. టీమిండియాకు స‌వాలే..!

-

మిగ‌తా జ‌ట్ల‌తో పోలిస్తే భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆల‌స్యంగా మ్యాచ్‌లు మొద‌లు పెట్ట‌డం త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని గ‌తంలో కెప్టెన్ కోహ్లి అన్నాడు. కానీ.. ప‌రిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీని భార‌త్ ఆల‌స్యంగా మొద‌లు పెట్టింది. అన్ని జ‌ట్లు 2, 3 మ్యాచ్‌లు ఆడేట‌ప్ప‌టికి గానీ భారత్ మ్యాచ్ ఆడలేదు. దీంతో ఆ ప్ర‌భావం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ల‌పై ప‌డ‌నుంది. రానున్న 10 రోజుల్లో టీమిండియా ఏకంగా 4 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే వ‌రుస మ్యాచ్‌ల‌తో భార‌త ఆట‌గాళ్ల‌పై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే మ్యాచ్‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే టీమిండియాలో బ్యాట్స్‌మెన్ల వైఫ‌ల్యం ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

మే 30వ తేదీన వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కాగా.. భార‌త్ జూన్ 5వ తేదీన త‌న తొలి మ్యాచ్ ఆడింది. అప్ప‌టికే ప‌లు టీంలు 2, 3 మ్యాచ్‌లు ఆడాయి. అయితే మిగ‌తా జ‌ట్ల‌తో పోలిస్తే భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆల‌స్యంగా మ్యాచ్‌లు మొద‌లు పెట్ట‌డం త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని గ‌తంలో కెప్టెన్ కోహ్లి అన్నాడు. కానీ.. ప‌రిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే చివ‌రిసారిగా భార‌త్ ఆడిన మ్యాచ్‌లో చాలా క్లిష్ట‌త‌ర ప‌రిస్థితుల్లో గెలిచింది. ఆఫ్గ‌నిస్థాన్ బౌల‌ర్ల‌ను కూడా టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎదుర్కొన‌లేక‌పోయారు. దీంతో భార‌త బ్యాటింగ్ లైన‌ప్‌పై అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి.

శిఖ‌ర్ ధావ‌న్ ఇప్ప‌టికే భుజం గాయం కార‌ణంగా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి దూరం కాగా.. ఆఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ విఫ‌లం అయ్యాడు. అలాగే టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ మ్యాచ్‌లో మిడిలార్డ‌ర్‌పై భారం ప‌డింది. కానీ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ కూడా విఫ‌లం అయ్యారు. దీంతో చాలా ఆఫ్గ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో భార‌త్ చాలా త‌క్కువ స్కోరు చేసింది. ఈ క్ర‌మంలో రానున్న మ్యాచ్‌ల‌లో టాప్ ఆర్డ‌ర్ మ‌రో సారి ఫెయిల్ అయితే అప్పుడు భార‌త్ ప‌రిస్థితి ఏమిట‌నేది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గా మారింది. అస‌లు భార‌త మిడిలార్డ‌ర్ స‌రిగ్గా ఆడ‌లేక‌పోతే.. అప్పుడు భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌దు క‌దా.. అని కూడా ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ల‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎలా ప్ర‌ద‌ర్శ‌న చేస్తార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ నెల 27న మాంచెస్ట‌ర్‌లో వెస్టిండీస్‌తో, 30న బ‌ర్మింగ్ హామ్‌లో ఇంగ్లండ్‌తో, జూలై 2వ తేదీన బ‌ర్మింగ్‌హామ్‌లోనే బంగ్లాదేశ్‌తో, 6న లీడ్స్‌లో శ్రీ‌లంక‌తో భార‌త్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌తో కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో భార‌త్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. అలాంటి స్థితిలో భార‌త బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉంటుందోన‌ని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అలాగే ఒక‌వేళ భార‌త్ సెమీ ఫైన‌ల్, ఫైన‌ల్ ఆడితే ఈ వ‌రుస మ్యాచ్‌ల ప్ర‌భావం ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా ప‌డుతుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే మ‌రి టోర్నీని ఆల‌స్యంగా ప్రారంభిస్తే టీమిండియాకు క‌ల‌సి వ‌స్తుంద‌ని కోహ్లి చెప్పిన మాట నిజ‌మ‌వుతుందా..? లేక టోర్నీ చివ‌ర్లో వ‌రుస మ్యాచ్‌ల‌తో ఒత్తిడి ఎక్కువై భార‌త్ ఓట‌ముల పాల‌వుతుందా..? అనే విష‌యం వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version