టీ20 ప్రపంచ కప్ సాధించి భారత్కు చేరుకున్న టీమ్‌ఇండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముంబయిలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న భారత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సుమారు గంటన్నరపాటు సాగిన విజయయాత్ర భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ర్యాలీ ముగిసిన అనంతరం ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు వాంఖడె స్టేడియానికి చేరుకుని సందడి చేశారు. స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాట్లాడారు.
‘‘రోహిత్, నేను చాలా కాలంగా దీని కోసం (టీ20 ప్రపంచ కప్) ప్రయత్నిస్తున్నాం. మేము ప్రతిసారి ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నాం. వాంఖడెకు ట్రోఫీని తిరిగి తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. 2011 ప్రపంచ కప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది. 15 ఏళ్లలో రోహిత్‌ను ఇంత ఎమోషనల్‌గా చూడటం ఇదే మొదటిసారి’’ – కోహ్లీ
‘‘మాకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులను చూస్తే ఈ టి20 ప్రపంచకప్ టైటిల్ కోసం మాలాగే వారు కూడా ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైంది. ఈ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుంది’’ – రోహిత్