మరో 3, 4 రోజుల పాటు ఇంగ్లండ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ తెలియజేయడంతో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు రద్దవుతాయోనని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఈసారి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆరంభంలో మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగాయి. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లలో ఉత్కంఠభరిత పోరాటాలు జరుగుతున్నాయి. దీంతో మ్యాచ్‌లను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుణుడు మాత్రం అనుకోని అతిథిగా విచ్చేసి మ్యాచ్‌లను రద్దు చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు వరల్డ్ కప్ ఆడుతున్న ఆయా దేశాల జట్లు మాత్రం ఆందోళన చెందుతున్నాయి. వరుణుడి దెబ్బకు మ్యాచ్ లు రద్దవుతున్న నేపథ్యంలో సెమీ ఫైనల్‌లో ఆడే జట్లపై ఆ ప్రభావం పడుతుందని ఆయా జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఇలా మరిన్ని మ్యాచ్ లు గనక రద్దయితే అప్పుడు మొత్తంగా ప్రపంచకప్ సమీకరణాలే మారిపోతాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి. వాటిల్లో రెండు మ్యాచ్‌లలో శ్రీలంక ఆడాల్సి ఉంది. బ్రిస్టల్‌లో శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కాగా, సౌతాంప్టన్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ కూడా రద్దయింది. అలాగే బ్రిస్టల్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దయింది. కాగా బ్రిస్టల్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో కనీసం ఒక బాల్ కూడా పడలేదు. సౌతాంప్టన్‌లో సౌతాఫ్రికా 7.3 ఓవర్లు ఆడి 2 వికెట్లకు 29 పరుగులు చేసింది. ఆ తరువాత వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది.
కాగా ప్రపంచకప్‌లో శ్రీలంకపై పాకిస్థాన్‌కు చక్కని రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు ప్రపంచకప్‌లలో 7 మ్యాచ్‌లు ఆడగా, పాక్ 7 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో లంకతో మ్యాచ్ జరిగి ఉంటే పాకిస్థాన్ కచ్చితంగా గెలిచి 2 పాయింట్లు సాధించేది. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దవడంతో పాక్ 1 పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో లంకకు ఆ మ్యాచ్ కలసి వచ్చింది. ఇక వరుసగా 3 మ్యాచ్‌లు ఆడిన సఫారీలు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయేవారే. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ కచ్చితంగా గెలిచి ఉండేది. 2 పాయింట్లు సాధించి ఉండేది. కానీ.. వర్షం పడడంతో మ్యాచ్ రద్దై వెస్టిండీస్ 1 పాయింట్‌ను మాత్రమే పొందింది. ఇలా జరగడం సౌతాఫ్రికాకు కలసి వచ్చింది.
ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కన్నా బంగ్లాదేశ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో నిన్న మ్యాచ్ జరిగి ఉంటే బంగ్లా జట్టు గెలిచి 2 పాయింట్లు పొందేది. అది ఆ జట్టును సెమీ ఫైనల్ చేర్చేందుకు చాలా ఉపయోగపడేది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో బంగ్లా, శ్రీలంక జట్లు చెరొక పాయింట్‌ను పొందాయి. ఇది కూడా లంకకు మేలే చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలకు గండి కొట్టినట్లయింది. ఆ దేశ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశ చెందారు.
ఈ వరల్డ్ కప్‌లో ఈసారి లంక ఆడిన రెండు మ్యాచ్ లు రద్దవడం ఆ జట్టుకు బాగా కలసి వచ్చిందనే చెప్పాలి. 2 మ్యాచ్ లతో లంకకు 2 పాయింట్లు వచ్చాయి. అంటే దాదాపుగా ఒక మ్యాచ్‌లో గెలిచినట్లే. ఇక మరోవైపు సఫారీల సంగతి ఆందోళనకరంగా మారింది. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన దాదాపు అన్ని వరల్డ్‌కప్‌లలో సౌతాఫ్రికా బలమైన జట్టుగా ఉండి మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. అయితే ఈ సారి మాత్రం సౌతాఫ్రికా వరుసగా 3 మ్యాచ్‌లలో ఓడింది. ఇక 4వ మ్యాచ్ రద్దయింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయనే చెప్పవచ్చు. ఆ జట్టు సెమీ ఫైనల్‌కు చేరాలంటే.. మిగిలి ఉన్న అన్ని మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇది ఆ జట్టుకు కత్తి మీద సామే అవుతుంది. దీంతో సౌతాఫ్రికా సెమీ ఫైనల్ చేరుతుందనే ఆశను ఆ జట్టు ఫ్యాన్స్ ఇప్పటికే వదిలేసుకున్నట్లు తెలిసింది.
కాగా ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్‌లన్నింటిలోనూ ఇలా వర్షం కారణంగా ఏకంగా 3 మ్యాచ్‌లు రద్దవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో అసలు తాము సరైన సమయంలోనే టోర్నీ నిర్వహిస్తున్నామా అన్న సందేహం ఇప్పుడు ఐసీసీకి కలుగుతోంది. అయితే అసలిప్పుడు ఇంగ్లండ్‌లో వేసవి కాలం. నిజానికి టోర్నమెంట్‌కు కూడా అనుకూలించే సమయమే. వాతావరణం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో తేడా కొట్టింది. వర్షాలు బాగా కురుస్తున్నాయి. అయితే.. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు 4 ప్రపంచకప్‌లు జరగ్గా 1975 వరల్డ్‌కప్ జూన్ 7 నుంచి జూన్ 21 వరకు కొనసాగింది. అలాగే 1979లో జూన్ 9 నుంచి 23 వరకు, 1983లో జూన్ 9 నుంచి 25 వరకు, 1999లో మే 14 నుంచి జూన్ 20 వరకు వరల్డ్ కప్‌లను నిర్వహించారు. అన్నీ దాదాపుగా జూన్‌లోనే జరిగాయి. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
అయితే ప్రస్తుత ప్రపంచ కప్‌లలో కేవలం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులకే రిజర్వ్ డేలను ఉంచారు. దీంతో ఆయా మ్యాచ్‌లు జరిగే సందర్భంలో వర్షం పడితే ఆటను నిలిపివేసి మరుసటి రోజు అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. కానీ లీగ్ దశలో ఉన్న మ్యాచ్ లకు రిజర్వ్ డేలు లేకపోవడం వల్ల వర్షం పడితే ఆటను నిర్వహించే పరిస్థితి లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వస్తోంది. అయితే లీగ్ దశలో అయినా సరే.. వర్షం పడినప్పుడు మ్యాచ్‌ను మరో 75 నిమిషాల సమయం వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ తాజాగా రద్దయిన మ్యాచ్‌లలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో ఆటలను తప్పనిసరై రద్దు చేశారు. లేదంటే మరికొంత సమయాన్ని పొడిగించి అయినా సరే.. మ్యాచ్‌లను నిర్వహించేవారు.
అయితే మరో 3, 4 రోజుల పాటు ఇంగ్లండ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ తెలియజేయడంతో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు రద్దవుతాయోనని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్లేయర్లు కూడా తమ జట్టుకు సెమీస్ అవకాశాలు దెబ్బ తింటాయని ఆందోళన చెందుతున్నారు. ఇక మరో 3, 4 రోజులు మ్యాచ్‌లు జరుగుతాయో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!