భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళ రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్ భూషణ్ ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజు దానిని కొనసాగించారు.
బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలంపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మాలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంటపాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా, వారి స్పందన అసంతృప్తిగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు.