ఎర్రబెల్లికి వార్నింగ్..ఎమ్మెల్యేలకు చిక్కులు.?

-

అధికారికంగా ఏదైనా సమాచారం ఉండి చెప్పారో..లేక తన సొంత అంచనాతో చెప్పారో తెలియదు గాని..ఇప్పుడు తెలంగాణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ 80 సీట్లు గెలవడం ఖాయమని, ఇంకో 20-25 మంది ఎమ్మెల్యేల సీట్లు మారిస్తే..100 సీట్లు గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో అంతర్గత సమాచారం ఉండబట్టే ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం ఉంది.

అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ పార్టీలో అలజడి రేగింది. ఎర్రబెల్లి చెప్పినట్లు నిజంగానే 20 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాకపోతే ఆ మధ్య సీఎం కే‌సి‌ఆర్ మాత్రం..సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ మళ్ళీ సీట్లు ఇస్తామని చెప్పారు. ఇలా కే‌సి‌ఆర్ చెప్పడానికి కారణం లేకపోలేదు. సీటు లేదంటే కొందరు గోడ దూకడానికి రెడీ అవుతారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు బి‌జే‌పి గేలం వేస్తుంది. అందుకే సీటు లేదని చెప్పకుండా అందరికీ సీట్లు అని చెప్పారు.

 

అయితే అందరికీ సీట్లు ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది. అలా సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు అలాంటి వారికి సీట్లు ఇస్తే ఓటమి ఖాయం. అలా అని సీటు లేదని చెబితే జంప్ అయిపోతారు. అందుకే కే‌సి‌ఆర్ తెలివిగా అందరికీ సీట్లు అని చెప్పారు..కానీ ఎన్నికల సమయంలో కొందరికి హ్యాండ్ ఇవ్వడం గ్యారెంటీ.

కాకపోతే దాన్ని ముందుగానే ఎర్రబెల్లి బయటపెట్టారని చెప్పవచ్చు. దీని వల్ల కొంతమంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. అందుకే ఎర్రబెల్లికి అనవసరమైన అంశాల్లో తలదూర్చ వద్దని కే‌సి‌ఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ ఇస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news