డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే గురువారం రోజున రెజ్లర్లు, వారి మద్దతుదారులు నల్ల రిబ్బన్లు కట్టుకుని ‘బ్లాక్ డే’గా పేర్కొంటూ నిరసన తెలియజేశారు. 18వ రోజు ఆందోళనలో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్, సత్యవ్రత్ కైద్యాన్, జితేందర్ కిన్హా నుదుటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తంజేశారు.
‘‘బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’ పాటిస్తున్నాం. మా పోరాటంలో యావత్ దేశం వెన్నంటే ఉన్నందున విజయంపై నమ్మకంతో ఉన్నాం. రోజురోజుకూ మా నిరసన ఉద్ధృతమవతోంది. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని బజ్‌రంగ్ పునియా తెలిపాడు. తమ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారని అతడు ఆరోపించాడు. తామేదో నేరం చేసినట్లు చూస్తున్నారని అన్నాడు.
‘‘సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం మైనర్ బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశాం. త్వరలోనే మిగతా ఆరుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాలు కూడా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తాం’’ అని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.