వేసవిలో తాగు నీరు లేక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తాగునీటి కోసం హైదరాబాద్ – శ్రీ శైలం జాతీయ రహదారిపై ప్రజలు రాస్తారోకో చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో తాగు నీరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఖాళీ బిందెలు, డ్రమ్ములను రోడ్డుగా అడ్డంగా పెట్టి గ్రామస్తులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.తలాపున కృష్ణమ్మ పారుతున్నా తాగునీరు లేక గొంతెండు తున్నదని దోమల పెంట ప్రజలు ఆందోళనకు దిగారు. కాగా, వెంటనే తమకు తాగునీరు సౌకర్యం కల్పించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.