కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. గత వారం పది రోజులుగా నిత్యం 15వేలకు పైగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. మరో వైపు వర్షాకాలం రావడంతో ప్రజల్లో ఇటు కరోనా భయం.. అటు విష జ్వరాల భయం పెరిగిపోతోంది. అయితే కరోనా నుంచి బయట పడేందుకు గాను కేంద్రం జూన్ 1 నుంచి అమలు చేస్తున్న అన్‌లాక్ 1.0 జూన్ 30వ తేదీతో ముగియనుంది. మంగళవారంతో ఆ గడువు ముగుస్తుంది. దీంతో జూలై 1 నుంచి అన్‌లాక్ 2.0 ఉంటుందని కేంద్రం చెప్పకనే చెప్పింది. మోదీ కూడా లాక్‌డౌన్ ఉండదని అన్నారు. అయితే రాష్ట్రాలు మాత్రం అన్‌లాక్ 2.0 కాకుండా లాక్‌డౌన్ 5.0 వైపు ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో అనేక నగరాలు, ముఖ్య పట్టణాల్లో అనేక చోట్ల లాక్‌డౌన్ విధించారు. కొన్ని చోట్ల ఏకంగా జూలై 15వ తేదీ వరకు, మరికొన్ని చోట్ల జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 1 నుంచి ఆయా చోట్ల లాక్‌డౌన్‌లను అమలు చేయనున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఇక తెలంగాణలో కేవలం హైదరాబాద్‌లోనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతుండడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ వరకు లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో 3, 4 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే దాదాపుగా అన్ని రాష్ట్రాలూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల పూర్తిగా లాక్‌డౌన్ విధించడానికే రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీని వల్ల కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయవచ్చన్నది రాష్ట్రాల ప్లాన్. అయితే జూలై 1 నుంచి ఏయే రాష్ట్రాలు ఏ తరహా వ్యూహాలను అమలు చేస్తాయో చూడాలి.