జాతీయ రహదారి-44ను 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్,బాలానగర్, నవాబ్‌పేట, మిడ్జిల్ మండలాల్లో రూ.118 కోట్ల నిధులతో చేపట్టిన డబుల్‌లేన్ బీటీ రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సాయంతో 44వ హైవే విస్తరకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించినట్లు వెల్లడించారు.
తుక్కుగూడ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఎం సహకారంతో ప్రత్యేక నిధులను కేటాయించి జిల్లాలో డబుల్‌లేన్ రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నల్లగొండ,మహబూబ్‌నగర్ జిల్లాల్లో డబుల్‌లేన్ రోడ్లు, బైపాస్ రోడ్ల అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి భూత్పూరు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.