కాళీయమర్దన చేసిన బాలకృష్ణుడు !!

-

శ్రీకృష్ణాష్టమి పర్వదినం. ఈరోజు స్వామిలీలలు స్మరించుకుంటే సకల పాపాలు పోతాయి. భయాలు దూరం అవుతాయి. ఆయన కృపకు పాత్రలము అవుతాం. బాలకృష్ణుడి లీలలు అన్ని ఇన్ని కాదు. ఆయన పుట్టినది మొదలు ఎనోన లీలలను చేసి చూపాడు. సాక్షాత్తు భగవత్‌ స్వరూపంగా పలు మార్లు ఆయన ప్రకటించుకున్న అవతారం. వీటిలో కాళీయ మర్దనం గురించి స్మరించుకుందాం…

కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు.

దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.

అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది. ఇలా కాళీయమర్దనం స్మరించుకుంటే అనేక గ్రహదోషాలు పోతాయి.

 – శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news