తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన ఘటన అనేక వివాదాలకి కారణం అయింది. తూర్పుగోదావరిలోని రాజమండ్రి రూరల్ సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఇసుక రేవుల నుంచి ఇసుకను తీసుకెళ్తున్న లారీలను అతివేగంగా నడుపుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన దళిత యువకులు కొందరు లారీలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సంఘటన స్థలానికి వచ్చి కారుతో యువకులను ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అయితే యువకులే దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి అక్కడున్న దళిత యువకుడు వరప్రసాద్ ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఏమయిందో ఏమో ట్రైనీ ఎస్సై అతనికి శిరోముండనం చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సైను సస్పెండ్ చేశారు. అయినా తనకు న్యాయం చేయలేదని భావించిన సదరు బాధితుడు ప్రసాద్, రాష్ట్రపతికి లేఖ రాశాడు. శిరోమండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఆయన అలా కుదరని పక్షంలో మావోయిస్టుల్లో కలిసిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరాడు.