కాంగ్రెస్ అసమర్థ పాలనలో ప్రభుత్వ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మొన్నటివరకు గురుకుల వ్యవస్థను భ్రష్టుపట్టించారని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారని కవిత మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితిపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
బుధవారం ‘ఎక్స్’ వేదికగా కవిత స్పందిస్తూ.. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తక్షణమే మధ్యాహ్న భోజన నిర్వాహకులను నియమించి విద్యార్థులకు పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా జిల్లా కలెక్టర్‌ను కోరారు.