నువ్వు పక్కమీద ఉండటం సూర్యుడు చూడగూడదు

-

‘వేకువ నోట్లో బంగారం ఉంటుంది’ – బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌. తెల్లవారుఝామునే లేవడం చాలామందికి బద్దకం. లేవాలనుకున్నా, అలారం ఆపేసి మళ్లీ పడుకుండిపోతారు. కానీ వేకువఝామున నిద్ర లేవడం అనేది అమృతతుల్యం అని నాటి వేదాలు, పురాణాల నుండి నేటి శాస్త్ర పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి.

పొద్దున్నే లేవడం వల్ల మరింత సమయం లభిస్తుంది. మనం పనిచేసే వేగం పెరుగుతుంది. ఇటీవల వెలువడిన పరిశోధనల ఫలితాల ప్రకారం, వేకువనే నిద్ర లేచినవారు శక్తివంతంగా ఉంటారు. చేయాల్సిన పనిని చాలా తొందరగా ముగిస్తారు. అదే పని తర్వాతయితే చాలా ఆలస్యమవుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలోనూ, ప్రణాళికలు రచించడంలోనూ, లక్ష్యాలను చేరుకోవడంలోనూ చాలా సునిశితంగా ఉంటారు.

ఉదయాన్నే మత్తు వదిలించుకునేవారు, మానసికంగా ధృడంగా తయారవుతారు. ఒత్తిడి దూరమవుతుంది. తద్వారా ఆ రోజు ఆశావహదృక్పథంతో మొదలయి, రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా పొద్దున్నే నిద్రలేచేవారు, రాత్రి పెందలాడే నిద్రకుపక్రమిస్తారు. దాంతో నిద్రానాణ్యత కూడా పెరుగుతుంది.

టెక్సాస్‌ విశ్వవిద్యాలయం వారు చేసిన పరిశోధనలో తేలిన విషయమేమిటంటే, వేకువఝామున నిద్రలేచిన విద్యార్థులు, లేట్‌గా లేచినవారితో పోలిస్తే, మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్నారట. అందువల్ల పొద్దున్నే లేవడమంటే మన ఉత్పాదకశక్తిని పెంచుకోవడమన్నట్లే.

ఈ ప్రపంచం లోని 75 శాతం మంది విజయులు తెల్లవారుఝామున నిద్రలేస్తున్న వారే.

అంబానీ, టిమ్‌కుక్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, ఇంద్రా నూయీ… ఇలా… ఎందరో…

అందరూ అద్భుత విజయాలను చూసినవారే. అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ వీళ్లందరిలోనూ ఉండే ఓ కామన్‌ లక్షణం ఏంటంటే… తెల్లవారుజామున కోడి కూయకముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు… ప్రపంచ ధనవంతుల్లో డెబ్భై ఐదు శాతానికి పైగా ఇదే అలవాటు.

సూర్యుడికి పట్టుబడలేదు – ముఖేశ్‌ అంబానీ, రిలయన్స్‌ కంపెనీల అధినేత

mukesh ambani
mukesh ambani

‘గత యాభై ఏళ్లలో సూర్యుడెప్పుడూ నన్ను మంచమ్మీద చూడలేదు’… రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేష్‌ అంబానీ తన జీవనశైలి గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలివి. రాత్రి పడుకునేసరికి ఎంత ఆలస్యమైనా ఐదింటికల్లా ముఖేష్‌ దినచర్య మొదలవుతుంది. నిజానికి నాలుగున్నరకే మెలకువ వచ్చినా, నిద్ర మత్తు వదిలించుకునేసరికి ఐదవుతుందని చెబుతారాయన. ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ జిమ్‌లో కసరత్తులు, తరవాత ఓ అరగంట ఈత అతడి వ్యాయామాల్లో భాగాలు. తరవాత వార్తాపత్రికలు చదివి, స్నానం, టిఫిన్‌ ముగించుకొని 8.30కల్లా ఆఫీసుకు బయల్దేరతారు. ‘చదువుకోకుండా పెట్రోలు బంకులో పనిచేసిన మా నాన్నే అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే, విదేశాల్లో చదువుకున్న నేను ఇంకెంత పెద్ద వ్యాపారవేత్తను కావాలి? ముసుగుతన్ని పడుకుంటే అది సాధ్యం కాదుగా’ అంటారాయన.

పనితోనే మొదలు – టిమ్‌ కుక్‌, ఆపిల్‌ సిఇఓ

ప్రపంచాన్ని శాసిస్తోన్న నాలుగైదు కంపెనీల్లో ఆపిల్‌ ఒకటి. కోడి కూయకముందే నిద్రలేచే వ్యాపార దిగ్గజాల్లో ఆపిల్‌ సీయీవో టిమ్‌ కుక్‌ కూడా ఒకరు. ‘ఈ రోజు నలభై ఐదు నిమిషాలు ఎక్కువ విశ్రాంతి దొరికింది. 4.30కు నిద్రలేచా’… టిమ్‌ కుక్‌ ఇటీవల చేసిన ట్వీట్లలో ఒకటిది. నాలుగున్నరకల్లా టిమ్‌ నుంచి సంస్థలోని సీనియర్‌ ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లిపోతాయట. 3.30-4 మధ్య నిద్ర లేచే టిమ్‌ వెంటనే ఆ రోజు పని ప్రణాళికనూ, ముఖ్య విషయాలనూ ఉద్యోగులకు తెలియజేయడానికే ప్రాధాన్యమిస్తారు. తరవాత ఇతర దేశాల్లోని ఆపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఫోన్‌చేసి ముఖ్యవిషయాలేమైనా ఉంటే చర్చిస్తారు. ఐదింటికల్లా జిమ్‌లో వాలిపోతారు. ‘ఆఫీసులో బాయ్‌ కంటే ముందు నేనుండటమే నాకిష్టం. ఉద్యోగిగా చేరినప్పట్నుంచీ సీయీవో అయ్యాక కూడా ఆ అలవాటు వదల్లేదు’ అంటారు టిమ్‌.

అది అదృష్టం – ఇంద్రానూయీ, అమెజాన్‌, ఐసిసి సభ్యురాలు, పెప్సికో మాజీ అధినేత్రి

‘నిద్ర దేవుడు మనిషికిచ్చిన వరాల్లో ఒకటంటారు. నా విషయంలో మాత్రం అది మరచిపోయాడు’ అంటారు పెప్సికో అధినేత్రి ఇంద్రా నూయీ. వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా నిద్రపైన తాను సాధించిన విజయం మాత్రం అపూర్వం అంటారామె. ‘యేల్‌ యూనివర్సిటీలో చదువుకునేప్పుడు అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదింటి దాకా రిసెప్షనిస్టుగా పనిచేసేదాన్ని. ఆ తరవాత వెళ్లి పడుకున్నా సరిగ్గా నిద్రపట్టేది కాదు. ముగ్గురు పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉండేది కాదు. అలా క్రమంగా తక్కువ నిద్రకు అలవాటు పడిపోయా’ అని చెబుతారు. ఉదయం నాలుగింటికల్లా నిద్రలేచే నూయీ ఏడింటికల్లా ఆఫీసులో ఉంటారు. ‘ఎన్నో ఏళ్లుగా రోజూ నాలుగ్గంటలే నిద్రపోవడం అలవాటైంది. మొదట్లో నిద్రపట్టకపోవడం అనారోగ్యం అనుకున్నా. కానీ త్వరగా నిద్రలేవగలగడం అదృష్టం అని తరవాత అర్థమైంది’ అంటారు నూయీ.

సిబ్బందికంటేముందే – పద్మశ్రీవారియర్‌, మైక్రోసాఫ్ట్‌, నియో బోర్డు సభ్యురాలు, మోటరోలా, సిస్కో మాజీ సిఇఓ

‘సిస్కో, మోటరోలా లాంటి సంస్థలకు సీటీవోగా పనిచేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్‌ కూడా వేకువ పక్షే. ఠంచనుగా నాలుగున్నరకల్లా నిద్రలేవడం ఆవిడకు అలవాటు. లేవగానే వ్యాయామం కంటే వ్యాపారానికే ప్రాధాన్యమిస్తారు. గంటసేపు మెయిళ్లు చూసుకొని జవాబివ్వాల్సిన వాటికి ఇచ్చేస్తారు. కాసేపు పత్రికలు చదివాక వ్యాయామానికి అరగంట సమయం కేటాయిస్తారు. తరవాత కొడుకు కర్ణను స్కూల్‌కు తయారు చేసి తానూ ఆఫీసుకు బయల్దేరతారు. సిబ్బంది కంటే ముందుగా ఎన్నో ఏళ్లుగా 8.30కల్లా ఆఫీసులో ఉండటం తన విజయం రహస్యాల్లో ఒకటంటారు వారియర్‌.

విజయ_రహస్యం – అజీమ్‌ ప్రేమ్‌జీ, విప్రో అధినేత

‘అందరికంటే రెండు గంటలు ముందు నిద్రలేచే అలవాటుంటే, ఏడాదిలో అందరికంటే ఓ నెల ఎక్కువ బతికినట్టే’… విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ నమ్మి ఆచరించే సిద్ధాంతం ఇది. తెల్లవారుజాము 4.30కల్లా బెంగళూరులోని ప్రేమ్‌జీ బంగళాలో దీపాలు వెలుగుతాయి. వేడివేడి కాఫీతో ప్రేమ్‌జీ దినచర్య మొదలవుతుంది. నాలుగు ఖండాల్లోని విప్రో మేనేజర్లతో ఈమెయిళ్ల సంప్రదింపులు, కాల్స్‌తో ఐదింటికల్లా ఆఫీసుపని మొదలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేప్పటికే ప్రేమ్‌జీ ఏడుగంటలు పనిచేసి ఉంటారు. అంత సామ్రాజ్యం సృష్టించాలంటే ఆ మాత్రం శ్రమ ఉండాల్సిందే కదా.
ఇలా… వీరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, విద్యాధికులు వేకువన నిద్ర లేస్తున్నవారే. అంతెందుకు? ఇప్పుడు కూడా ఊళ్లల్లో వ్యవసాయపు పనికి వెళ్లేవారు, పొద్దున నాలుగు గంటల కల్లా పొలంలో ఉంటారు. రాత్రి ఏడు గంటలకు మంచంమీద ఉంటారు. వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కావాలంటే, రాబిన్‌శర్మ ‘5 ఏఎం క్లబ్‌’ అనే పుస్తకాన్ని చదవండి. తెలుగు అనువాదం కూడా దొరుకుతోంది.

అయితే, ఉదయాన్నే లేవడం అనేది వృధా కాకుండా చూసుకోవాలి. లేవగానే చేయాల్సిన పనులు రెడీగా ఉండాలి. వ్యాయామం చేయడం కావచ్చు, ధ్యానం చేయడం, చదువుకోవడం, ప్రాజెక్టువర్క్‌ చూసుకోవడం, మరేదైనా ఏకాగ్రత అవసరమయ్యే పని పెట్టుకోవడం జరగాలి. లేకపోతే, విలువయిన సమయాన్ని హత్య చేయడమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news