ఏపీ రాజకీయంలో జంపింగ్‌లో జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలకే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలోకో లేదా వైసీపీలోకో జంప్ అవుతున్నారు. ముందుగా నలుగురు రాజ్యసభ సభ్యులతో ప్రారంభమైన వలసల పర్వం ఆగడం లేదు. ఈ వలసలకు ఎప్పటకీ బ్రేక్ పడుతుందో ? కూడా ఎవ్వరూ ఊహించని పరిస్థితి. ఇప్పుడే టీడీపీ వలసలతో డీలా పడుతోంది అనుకుంటే వచ్చే ఐదేళ్ల పాటు చంద్రబాబు పార్టీని ఎలా నడుపుతారో ? అర్థం కాని పరిస్థితి.
ఇక జనసేన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుగా ఉంది. ఆ పార్టీలో పట్టుమని పది మంది కూడా పేరున్న నేతలు లేరు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమయ్యాడో తెలియని పరిస్థితి. ఇక పవన్ కమిటీలు వేసినా ఆ కమిటీలు ఎప్పుడు ? ఏం చేస్తాయో ? ఎవరెవరు కమిటీల్లో ఉంటారో ? తెలియదు. అసలు పవన్ మీద కార్యకర్తలకు, ఆయన అభిమానులకే నమ్మకం లేనప్పుడు ఇక పార్టీలో నేతలు మాత్రం ఎందుకు ఉంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ క్రమంలోనే జనసేనలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సైతం వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. బాలరాజు కాంగ్రెస్‌లో సీనియర్ నేత. ఆయన గతంలో రద్దయిన చింతపల్లి నియోజకవర్గంలో కీ రోల్ ప్లే చేశారు. వైఎస్ అండతో 2009లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలిచిన బాలరాజు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
బాలరాజు 2019 ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన పాడేరు అసెంబ్లీ సీటు ఆశించారు. అప్పటికే ఆ సీటుపై జగన్ మరొకరికి హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు అరకు ఎంపీ సీటు ఆఫర్ వచ్చినా జనసేనలో చేరి పాడేరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జనసేనలో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ ఏంటన్నదానిపై క్లారిటీ ఉండడంతో జగన్ చెంతకు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.